భాద్రపద మాసం ప్రారంభం , భాద్రపద మాస విశిష్టత - Bhadrapada Masam importance and rules in Telugu

naveen

Moderator

భాద్రపద మాసం ప్రారంభం , భాద్రపద మాస విశిష్టత

చంద్రమాన రీత్యా చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండడం వల్ల ఇది భాద్రపద మాసం.



ఈ మాసం లో ఒంటి పూట భోజనం చేస్తే ధన సమృద్ది ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. ఉప్పు మరియు బెల్లం దానాలు కూడా ఈ మాసం లో విశేష ఫలితాన్నిస్తాయి. కొన్ని ప్రదేశాలలో స్త్రీలు భాద్రపద శుక్ల తదియ రోజున హరితాళిక వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించి , ఉపవాసం జాగరణ చేస్తారు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరిస్తే కష్టాలు తొలగి , అష్టైశ్వర్యాలతో తులతూగుతారు.

భాద్రపద శుద్ద చవితి నాడు ఆది దేవుడైన వినాయక ఆవిర్భావం జరిగిన రోజు , ఈ రోజున గణపతి పూజ ఉపవాసం వంటివి విశేష ఫలితాన్నిస్తాయి. ఈ పండుగ ఆదివారం రోజు కాని , మంగళవారం రోజు కాని రావడం మరింత విశేషాన్ని సంతరించుకొంటుంది.



భాద్రపద శుద్ద పంచమి నాడు ఋషి పంచమి జరుపుకొంటారు. ఇది కేవలం ఆడవారికి సంబంధించిన ప్రాయోశ్చితాత్మకమైన వ్రతం. ఈ వ్రతం చేయడం వలన స్త్రీలు ఋతుశ్రావ సమయం లో చేసిన పాపాలన్నీ తొలగి పుణ్య ఫలితం లభిస్తుంది అని భవిష్యపురాణం లో చెప్పబడింది. ఈ వ్రతం లో ముఖ్యంగా ఆచరించవలసినది , బ్రహ్మహణుడికి అరటి పళ్ళు , నెయ్యి , పంచదార , దక్షిణ ఇవ్వాలి. ఒంటి పూట భోజనం చేయాలి. అంతే గాక ఆ భోజనం ధాన్యం , పాలు , పెరుగు , ఉప్పు , పంచాదారలతో తయారుచేయకుండా ఉండాలి. పళ్ళని స్వీకరించడం శ్రేయస్కరం.

బౌద్ద జయంతి ని కూడా ఈ రోజునే జరుపుకొంటారు. బుద్దుని భోధనలు మానవుని ధర్మబద్దమైన , పవిత్రమైన జీవనానికి వెలుగు బాట వేసాయి. ప్రపంచం లోని ధర్మమతస్తాపనకు బుద్దుడు అత్యున్నత స్థానం వహించాడనే విషయంలో ఏమాత్రం భేదాభిప్రాయాలు లేవు.

భాద్రపద శుద్ద షష్ఠి - సూర్య షష్ఠి , సప్తమి కలసిన షష్ఠి సూర్యునికి ప్రీతికరం , ఈరోజున సూర్యుడిని ఆవుపాలు , పెరుగు , నెయ్యి , గోమయం , గోమూత్రం తో ప్రాశనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలం కంటే ఎక్కువ ఫలం కలుగుతుందని శాస్త్రం లో చెప్పబడింది. షష్ఠి తో కూడిన సప్తమి ఉంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి ని పూజిస్తే ఎటువంటి పాతకాలైన నశిస్తాయి.



భాద్రపద శుద్ద అష్టమి నాడు కేదారవ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని సంప్రదాయ సిద్దం గా ఆచరిస్తుంటారు. భాద్రపద శుద్ద దశమి నాడు దశావతార వ్రతం ఆచరించడం , దేవ , ఋషి , పితరులకు తర్పణాలు చేయడం ముఖ్యమైన విధులు. భాద్రపద శుద్ద ఏకాదశి , దీన్నే పద్మ పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజున పాల సముద్రం లో శేషతల్పం పై శయనించిన శ్రీమహావిష్ణువు , ఈ ఏకాదశి రోజున ప్రక్కకు పొర్లి పరివర్తనం చెందుతాడు , అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కరువు కాటకాలు తొలగి పోతాయి , ముఖ్యం గా సంధ్యాసమయం లో శ్రీ మహా విష్ణువు ని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

భాద్రపద శుద్ద ద్వాదశి వామన జయంతి గా చెప్పబడింది , ఈ రోజున వామనున్ని ఆరాదిస్తే అన్ని విషయాలలోనూ విజయం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున బ్రాహ్మణులకు పెరుగును దానం చేస్తే మంచి ఫలితాలని పొందవచ్చు.

భాద్రపద మాసం లో శుద్ద చతుర్దశి నాడు అనంత పద్మనాభ చతుర్దశి అంటారు. శేషతల్పసాయిగా నాభికమలం తో శ్రీమహాలక్ష్మి సమేతుడైన శ్రీమహావిష్ణువు ని పూజించి , వ్రతమాచరిస్తే దారిద్ర భాధలు తొలగి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.



భాద్రపద పూర్ణిమ రోజు ఉమామహేశ్వర వ్రతం జరుపుకొంటారు , భక్తి శ్రద్దలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖశాంతులతో పాటు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.

భాద్రపద పూర్ణిమ తో మహాలయపక్షం ఆరంభమవుతుంది, అమావాస్య వరకు గల ఈ కాలాన్ని పితృ పక్షం అని కూడా అంటారు. మృతులైన పితరులకు , పూర్వీకులకు తప్పనిసరిగా తర్పణలివ్వాలి. శ్రాద్దాన్ని యధాశక్తి గా ఈ దినాలలో చేయాలి.

భాద్రపద బహుళ తదియ ని ఉండ్రాళ్ళ తద్దేగా చెప్పబడింది. ఇది స్త్రీలు చేసుకొనే పండుగ , ముఖ్యంగా కన్నె పిల్లలు గౌరీ దేవిని పూజించి , ఉండ్రాళ్ళను నివేదిస్తే మంచి భర్త వస్తాడని చెప్పబడింది. స్త్రీలకు అయిదవతనం వృద్ది చెందుతుంది.



భాద్రపద కృష్ణ ఏకాదశి అజ ఏకాదశి దీన్ని ధర్మప్రభ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతమాచరించి నూనె గింజలను దానం చేస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు.

భాద్రపద కృష్ణ అమావాస్య మహాలయమావాస్య , ఈ రోజున పితృ తర్పణాలు , దానధర్మాలు చేయడం ఆచారం.


Tags: భాద్రపద మాసం, Bhadrapada Masam, Bhadrapada masam 2024 Telugu Calendar, Bhadrapada masam in Telugu, Bhadrapada Masam 2024, Bhadrapada masam Importance
 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock