దేవతలరాజైన ఇంద్రుడి చేత నిర్మంచబడిన ప్రసిద్ధ పంచ మాధవ క్షేత్రాలు.. ఇవే.. Pancha Madhava Temples

naveen

Moderator

పంచ మాధవ క్షేత్రాలు..

పుణ్య భూమి అయిన మన భరత ఖండంలో దేవతలరాజైన ఇంద్రుడి చేత నిర్మంచబడిన ప్రసిద్ధ మాధవ క్షేత్రాలే.. ఈ పంచ మాధవ క్షేత్రాలు.. ఇవే..



1) బిందు మాధవ ఆలయం - వారణాసి

2) వేణీ మాధవ ఆలయం - ప్రయాగ

3) కుంతీ మాధవ ఆలయం - పిఠాపురం

4) సేతు మాధవ ఆలయం - రామేశ్వరం

5) సుందర మాధవ ఆలయం - తిరువనంతపురం.



ఈ క్షేత్రాల స్థాపన వెనుక వున్న ప్రసిద్ధ పురాణ గాథ ఏమిటంటే..

బ్రహ్మ కుమారుడైన ప్రజాపతి త్వష్టకు విశ్వరూపుడనే కుమారుడు జన్మించాడు. విశ్వరూపుడికి మూడు తలలు ఉండేవి మరియు ఇతడు మహాబలశాలి. ఒకరోజు ఇంద్రుడు సభ తీర్చి ఉండగా దేవతల గురువు అయిన బృహస్పతి అక్కడకు వస్తాడు. అందరి వద్ద పూజలు అందుకొంటున్న ఇంద్రుడు తన గురువు వస్తే లేచి గౌరవించకుండా ఉదాసీనంగా ఉంటాడు. ఆ విధంగా అగౌరవించబడ్డ బృహస్పతి ఖిన్నుడై తన గృహానికి వెళ్తాడు. ఆ తరువాత ఇంద్రుడు తాను చేసిన తప్పును గ్రహించి బృహస్పతి ఇంటికి బయలుదేరుతాడు. ఇంద్రుడు తన ఇంటికి వస్తున్నాడని గ్రహించి బృహస్పతి ఇంద్రునికి కనిపించకుండా అంతర్థానమౌతాడు. ఇంద్రునికి బృహస్పతి అనుగ్రహం తప్పిందని అసురులకు తెలిసి, అసురులు శుక్రాచార్యుల అనుగ్రహంతో యుద్ధం ప్రకటించి ఇంద్రాదులను ఓడించి స్వర్గం నుండి తరుముతారు. అప్పుడు ఇంద్రుడు ఏమి చేయాలో తోచక బ్రహ్మ వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతం చెబుతాడు.

అప్పుడు బ్రహ్మ విషయాన్ని గ్రహించి ఇంద్రునితో వారికి గురువు అవసరం ఉందని చెప్పి, త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుని వద్దకు వెళ్ళి గురువుగా ఉండమని అర్థించమని చెబుతాడు. విశ్వరూపుడు చాల పిన్నవయస్సులో ఎన్నో యాగాలు చేసి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాడు. ఇంద్రుడు బ్రహ్మ సూచన ప్రకారం విశ్వరూపుని వద్దకు వెళ్ళి గురుస్థానాన్ని తీసుకోవలసిందిగా, తమకు స్వర్గం లభించే మార్గం ప్రసాదించి, ఆ స్వర్గ సుఖాలు ఆనందించమని కోరుతాడు. విశ్వరూపునికి మూడు ముఖాలు ఉంటాయి. ఆయన ఒక ముఖంతో హవిస్సు ఇచ్చినప్పుడు అన్నం తింటాడు. మరో ముఖంతో సురాపానం చేస్తాడు. మూడో ముఖంతో సోమరసం త్రాగుతాడు.



యజ్ఞాలలో విశ్వరూపుడు మొదట తనకు తరతమ భేదం ఉండదని, బ్రహ్మజ్ఞానం కలవాడినని, తాను తన జీవనం పొలంలో పడిపోయిన ఒడ్లు ఏరుకొని జీవనం చేస్తుంటానని అంటాడు. "నేను మీ కోరిక మన్నించి నేను గురుత్వం వహించి మీకు పౌరోహిత్యం చేస్తే, మీ కోరికల కొరకు నేను యజ్ఞాలు చేస్తే నా బ్రహ్మ తేజస్సు తగ్గిపోతుంది" అని అనగా, ఇంద్రాదులు, విశ్వరూపుని మరింత వేడుకోగా వారి కోరిక మన్నించి గురుత్వం వహిస్తాడు. తరువాత అసురుల సామర్థ్యాన్ని అంచనా వేసి, ఇంద్రుడికి నారాయణ కవచం ఉపదేశం చేశారు విశ్వరూపుడు.

నారాయణ కవచం విశేషం చెబుతూ ఒకప్పుడు కౌశికుడు అనే బ్రాహ్మణుడు నారాయణ కవచాన్ని అనునిత్యం పఠిస్తూ ఒక ఎడారిలో ప్రాణాలు విడిచి పెట్టేశాడు. నారాయణ కవచం తేజస్సు అస్థికలను పాతేసింది. ఆ విధంగా ప్రాణాలు విడిచిన కౌశికుడు అస్థిపంజరం ఎడారిలో పడి ఉండిపోయింది. ఒకరోజు చిత్రవధుడు అనే గంధర్వుడు భార్యలతో కలిసి ఆకాశమార్గంలో విమానంలో ఆ మార్గం గుండా వెళ్తుండగా విమానం అక్కడి వరకు వచ్చి కౌశికుడి అస్థికలు ఉన్న ప్రదేశం వద్ద ఆగిఫొయింది. విమానం క్రింద పడిపోయింది. అప్పుడు గంధర్వుడు భార్యలతో బయట పడిపోయాడు.



అప్పుడు వాలకీయుడు అనే మహర్షి అక్కడకు వచ్చి చిత్రవధుడికి కౌశికుడి వృత్తాంతం తెలిపి నారాయణ కవచం ప్రభావం వల్ల విమానం ఆగిపోయిందని, ఆ అస్థికలను సరస్వతీ నదిలో నిమర్జనం చేసి ఆచమానం చేస్తే విమానం కదులుతుందని తెలిపి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ మహర్షి. చిత్రవధుడు వాలకీయుడు చెప్పినట్లు చేస్తే విమానం ముందుకు కదిలిందని విశ్వరూపుడు నారాయణ కవచ మహత్యాన్ని తెలుపుతూ ఇంద్రునికి నారాయణ కవచాన్ని ఉపదేశిస్తాడు. నారాయణ కవచ ప్రభావంతో ఇంద్రుడు అసురులపైకి దండెత్తి అమరావతిని స్వాధీనం చేసుకొన్నాడు. ఇంద్రుడు విశ్వరూపుడితో అమరావతిలొ ఉన్న భాగ్యాలు ఆనందించమని చెబితే విశ్వరూపుడు.. గురువులకు శిష్యులే ధనం అని చెబుతాడు. విశ్వరూపుడు యజ్ఞాలలొ హవిస్సులు తీసుకొని అని ఇంద్రాదులకు ఇస్తుండేవాడు.

విశ్వరూపుడు తల్లి రచన రాక్షస వంశానికి చెందినది. అందుచేత అసురులు విశ్వరూపుని వద్దకు వెళ్ళి అసురులకు మేనమామ అయిన విశ్వరూపుడిని, యజ్ఞాలలొ హవిస్సులను ఇంద్రుడికి తెలియకుండ తమకు ఇవ్వమని కోరుతారు. బ్రహ్మ జ్ఞానం కలిగి తరతమ భేదాలు లేని విశ్వరూపుడు రాక్షసులు కోరిన విధంగా ఆ హవిస్సులలొ కొంత భాగం రాక్షసులకు ఇస్తుండేవాడు. కొద్దిరోజుల తరువాత ఇంద్రుడికి ఆ విషయం తెలుస్తుంది. అప్పుడు ఇంద్రుడు యుక్తాయుక్త విచక్షణ విడిచి తన వద్దనున్న చంద్రహాసంతో విశ్వరూపుని మూడు శిరస్సులను నరికి వేస్తాడు. సురాపానం చేసే శిరస్సు ఆడాపిచుకగా మారి పోయింది, సోమపానం చేసే శిరస్సు కౌజు పక్షిగా మారిపోయింది. అన్నం తినే శిరస్సు తిత్తిరి పిట్టగా మారిపోయింది. ఆ మూడు పక్షులు విశ్వరూపుడు చేసిన బ్రహ్మహత్యాపాతకాన్ని సూచిస్తాయి. ఈ మూడు పక్షులు ఒక ఏడాది కాలం అరుస్తూ ఇంద్రుడి చెవ్వుల్లొ రొదగా ఉండేవి.



వాటి బాధ భరించలేక బ్రహ్మహత్యాపాతకాన్ని నివారించు కోవడం కోసం ఇంద్రుడు తన పాపాన్ని నాలుగు భాగాలుగా చేసి భూమికి, స్త్రీలకు, నీటికి, వృక్షాలకు తలో పావు భాగం పంచుతాడు. బ్రహ్మహత్యాపాతకం పాపం తీసుకొన్నందుకు ఆ నాలుగు జాతులకు నాలుగు వరాలు ఇచ్చాడు. భూమికి వరంగా ఇక్కడైన గోతులు తీస్తే ఆ గోతులు తమంతతాము పూడుకొనేటట్లుగా, వృక్షాలకు ఎవరైన మొదలు ఉంచి కొమ్మలు, ఆకులు నరికివేస్తే ఆ వృక్షము లేదా మొక్క తమంతట తాము పెరిగేటట్లుగా, నీటికేమో ప్రక్షాళన గుణాన్ని, స్త్రీలకేమో కామభోగాల యందు కొద్దిపాళ్ళు ఎక్కువ సుఖాన్ని ప్రసాదించాడు. బ్రహ్మహత్యపాతకం క్రింద వారు అనుభవించే బాధలు భూమి కొన్నిచోట్ల పంటలు లేకుండా ఉండడం (ఊసర క్షేత్రాలు), నీరు నురుగుతో ఉండడం, వృక్షాలు జిగురు, స్త్రీలకు ఋతుస్రావం.

ఈలోపున.. కుమారుని మరణ వార్త విన్న త్వష్ట ఇంద్రుడి పైన పగ తీర్చుకోవడానికి ఓ మహా యాగన్ని నిర్వహించాడు. ఆ యాగం నుండి జన్మించిన వాడే "వృత్తాసురుడు". తన అన్నను చంపిన ఇంద్రుడిని ఎలాగైనా చంపడమే వృత్తాసురుని లక్ష్యం. ప్రతీ రోజు మూడు అడుగుల పెరుగుతూ సంధ్యా కాలములో కాలిన మబ్బులా ఉన్నాడు. కాలిన రాగి లాంటి శిఖలూ మీసములూ, మధ్యాన్న సూర్యుని ప్రకాశము గలవాడై ప్రకాశించే శూలముతో నాట్యం చేస్తూ గర్జిస్తూ ఉన్నాడు. ఆకాశాన్నే తాగుతున్నట్లు నోరు తెరిచి నాలుకతో నక్షత్రాలను నాకేస్తూ, నోటితో లోకాలను మింగేస్తూ, దన్ష్ట్రలో లోకాలు లోపలకు పోయేట్లు ఆవాలిస్తూ ఉండగా దేవతలందరూ భయపడి అన్ని దిక్కులకూ పారిపోయారు.



అన్ని లోకాలకూ ఆవరించాడు కాబట్టి అతని పేరు వృత్తుడు. ఇతను మహా భయంకరుడు. దేవతలు అతన్ని చంపడానికి వచ్చి కొడుతున్నారు. దేవతలు ప్రయోగించే దివ్యాయుధాలను కూడా మింగేస్తున్నాడు వృత్తాసురుడు. దేవతల ఆయుధాలూ తేజస్సు బలమూ కూడా మింగేసాడు వృత్తాసురుడు. అప్పుడు.. ఇంద్రుడు నారాయణున్ని శరణువేడగా, నీవు ధధీచి మహర్షి వద్దకు వెళ్ళి అతని శరీరాన్ని కోరు. ధధీచి శరీరం అంతా నారాయణ కవచమే ఉంది. నారాయణ కవచమే నారాయణ కవచాన్ని ఎదుర్కోగలదు. అని చెప్పి ఆ దేవతలందరూ చూస్తుండగానే శ్రీమన్నారాయణుడు అంతర్ధానమయ్యాడు. పరమాత్మ చెప్పినట్లు దేవతలందరూ ధధీచి వద్దకు వెళ్ళి ధధీచి శరీరాన్ని అడిగితే వారి మాటలు అంగీకరించి తన మనసునీ ఆత్మనూ పరమాత్మ యందు నిలిపి యోగ ధారణతో శరీరాన్ని విడిచిపెట్టాడు.

అప్పుడు అతని ఎముకలతో విశ్వకర్మ వజ్రాయుధాన్ని సిద్ధం చేసి అందులో పరమాత్మ తేజస్సు కూడా నిక్షిప్తం చేసాడు అదే వజ్రాయుధం. వజ్రాయుధాన్ని తీసుకుని ఐరావతం మీద తనతో యుద్ధానికి వచ్చిన తన సోదరున్ని చంపిన ఇంద్రున్ని చూచి వృత్తాసురుడు ఉండ బట్టలేక. ప్రళయకాలాగ్ని లాగ భయంకరమైన శూలాన్ని ఇంద్రుని మీద వేయగా ఆ శులాన్ని వజ్రాయుధముతో ఖండించి శూలము విసిరి వృత్తాసురుడి యొక్క ఒక బాహువుని ఖండించాడు. ఒక చేయి పోయిన రెండవ చేతితో ఒక పరిఘను తీసుకుని ఇంద్రుని దవడ మీద కొట్టాడు. ఆ దెబ్బకు ఇంద్రుడు వజ్రాయుధాన్ని జరవిడిచాడు. ఆయుధము లేని ఇంద్రున్ని వృత్తాసురుడు కొట్టలేదు.



ఇంద్రుని స్థితి చూసి అందరూ హాహాకారాలు చేసారు. ధర్మం తెలిసిన ఇంద్రుడు వజ్రాయుధాన్ని తిరిగి తీసుకోలేదు. ఆయుధము తీసుకో.. అని వృత్తాసురుడు చెప్పాడు. వజ్రాయుధము తీసుకుని వృత్తాసురుడి ఇంకో బాహువునూ ఇంద్రుడు ఖండించాడు. అయినా వృత్తాసురుడు రెండు పాదాలతో పర్వతాలనూ భూమినీ దేవతలనూ అల్లకల్లోలం చేస్తూ నోరు బాగా తెరిచి వాహనముతో కూడి ఉన్న ఇంద్రున్ని మింగేసాడు. నారయణ కవచ ప్రభావము వలన ఇంద్రుడు కడుపులోకి వెళ్ళి తన వజ్రాయుధముతో వృత్తాసురుని కడుపు చీల్చి బయటకు వచ్చి వృత్తాసురుని శిరస్సును ఖండించాడు. వృత్తాసురుడు అసురుడైనా పుట్టుకతో బ్రాహ్మణుడు.. అందువల్ల బ్రహ్మహత్యా పాతకం నుండి తప్పించుకోవడానికి ఇంద్రుడు ఈ భూమి పైన ఐదు వైష్ణవాలయాలను నిర్మించాడు.. అవే ‘పంచ మాధవ క్షేత్రాలు’ గా ప్రసిద్ధి చెందాయి..


Tags: పంచ మాధవ క్షేత్రాలు, Veni Madhava Temple, Kunthi Madhava Temple, Bindu Madhav Temple, Sunder Madhava Temple, Sethu Madhava Temple, Pancha kesava kshetralu in telugu, pancha madhava temples, Varanasi, Prayaga, Pithapuram, Pancha Madhava Kshetras Telugu
 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock