కాలభైరవ స్వామి చరిత్ర ఎవరైతే వింటున్నారో వాళ్ళు సుఖసంతోషాలతో జీవిస్తారు | Story of Lord Kala Bhairava

naveen

Moderator

కాలభైరవ_స్వామి_చరిత్ర!

ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అస్సలు బ్రహ్మము ఎవరో అని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు.

శంకరుడికి సద్యోజాత, అఘోర ,తత్పురుష, ఈశాన, వామదేవ అను అయిదు ముఖములు ఉంటాయి.



ఈ అయిదు ముఖములతో ఋషుల వంక చూస్తూ అన్నాడు ‘అదేమిటయ్యా బ్రహ్మము ఎవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మమును’ అన్నాడు.

అపుడు బ్రహ్మగారు ‘నేనే ఈ లోకముల అన్నిటిని సృష్టించాను, నేనే ని పుట్టుక కు కర్తను. నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను, నేనే వీటిని సంహారం చేస్తాను. నేనెప్పుడూ బతికే ఉంటాను. కాబట్టి నాకన్నా బ్రహ్మము ఎవరు? నేనే బ్రహ్మమును’ అన్నాడు.

తరువాత పక్కనున్న విష్ణువు ‘బ్రహ్మా అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా,కావున నేనే బ్రహ్మమును అన్నాడు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది.

మనకి శృతి ప్రమాణం కదా అందుకని వేదాలని పిలుద్దాం అని వేదాలని పిలిచారు.



ఋగ్వేదం:

అపుడు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ,ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్టమొదట నారాయణుడు జన్మించాడో, ఎవడు చిట్టచివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో ,అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది.

యజుర్వేదము:

తరువాత యజుర్వేదమును పిలిచారు. అసురీశక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింప బడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది.

సామవేదము:

తరువాత సామవేదమును పిలిచి అడిగారు మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో, ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో, ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ,ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో ,ఎవడు తనలో తాను రమిస్తూ ఉంటాడో ,అటువంటి శివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది.



అధర్వణవేదము:

పిమ్మట అధర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో ,అటువంటి పరమశివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది.

అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు. తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. నాలుగు వేదములు అదే చెప్తున్నాయి.

ప్రణవం:

ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. అపుడు ప్రణవం ఎవడు నిరంతరమూ శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో, అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో ,అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతి వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము’ అని చెప్పింది.

ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈమాటలు రుచించక పోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారాడు.



జ్యోతి సాకారం అయింది. సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ నీవు ఎవరు? నువ్వు నా రెండు కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు. నన్ను స్తోత్రం చెయ్యి’ అన్నాడు.

బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి. కాబట్టి ఇపుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. ‘శంకర ఏమి నీ ఆజ్ఞ అని అడిగాడు. బ్రమ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు. అయిదవ తలను గిల్లెయ్యి’ అన్నాడు.

ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరమై రూపం తొ ,బ్రమ్మ అయిదవ తలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం.

ఇలా జరిగే సరికి బ్రహ్మ భయపడి పోయి నాలుగు తలకాయలు అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి ఈశ్వరా, నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు.

అపుడు శంకరుడు కాల భైరవునితో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఇవాళ్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు.

కాలభైరవ నీవు ఎంత గొప్ప వాడవయినా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. ఈ అయిదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను. అపుడు నీ బ్రహ్మ హత్యా పాతకం పోతుంది. అని చెప్పాడు.



బ్రహ్మహత్యాపాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించినా తనకు సోకిన బ్రహ్మహత్యాపాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు.

కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు

కాలభైరవా! నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు. బ్రహ్మ దేవుడి గర్వమును అణుచుటకు జనించినవాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు. కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు... కాశీ క్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మ హత్యాపాతకం భస్మమైపోతుంది’’ అని సలహా యిచ్చాడు.

దీనితో- కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యాపాతకం తొలగిపోగా, బ్రహ్మకపాలాన్నీ కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే - నేటి కాశీ క్షేత్రంలోని ‘‘కపాల మోక్షతీర్థం’’.

కాశి లొ కాలభైరవుడు విశ్వనాథ లింగాన్నిభక్తి తొ పూజించి తరించాండు.విశ్వనాధుడు భక్తి కి మెచ్చి కొన్ని వరాలు ఇచ్ఛాడు.

కాలభైరవ ఎవడు ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు. దీనిని ‘భైరవ యాతన’ అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు.

కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయమునకు వచ్చినపుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసెయ్యి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను ‘అమర్దకుడు’ అని పిలుస్తారు.



ఇకనుంచి నీవు నా దేవాలయ ములలో క్షేత్ర పాలకుడవయి ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేయ్యి. నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు ‘పాప భక్షకుడు’ అనే పేరును ఇస్తున్నాను.

నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు’ అని చెప్పాడు.

అందుకే మనను కాశీక్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్రప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవా’ అని

ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతా పూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇకనుంచి మంచి పనులు చేస్తాను, అని అన్న సంతర్పణ చేస్తాడు. భైరవ మూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మేడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదమును తీసుకోవాలి.

ఇహలోకమునందు ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింప చేస్తాడు.

అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసా దేవి ఆలయమునకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ‘ఒకసారి ఒంగోండి’ అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని ఆ కర్ర ఠప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి.

ఈ విధంగా ఆనాడు పరమేశ్వరుడు కాల భైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు. ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వర ఆజ్ఞను ఔదలదాల్చి వచ్చినవాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు.

ఆయన భక్తుల పాలిట కొంగుబంగారం. ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనపడతాడు.

కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. ‘మేము కాశీ వెళ్ళాము – మాకు ఇంట ఏ భయమూ లేదు’ అని చెప్పడానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు. కాబట్టి ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది.



ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా, సుఖంగా ఉంటారు.


Tags: కాలభైరవుడి కథ, Story of Lord Kala Bhairava, Kalabhairava ashtakam telugu, Kalabhairava Temple near me, Kalabhairava Ashtakam, Kalabhairava temple, Kalabhairava Story Telugu, Kalabhairava History Telugu
 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock