కార్తీక పౌర్ణమి ఏరోజు వచ్చింది? కార్తీక పౌర్ణమి వ్రత విధానం ప్రాముఖ్యత | Kartik Purnima Significance

naveen

Moderator


కార్తీక పూర్ణిమ హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది సాధారణంగా నవంబర్‌లో వచ్చే కార్తీక మాసంలో పౌర్ణమి రోజున వస్తుంది. ఈ పండుగ అపారమైన మతపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు భారతదేశం అంతటా ప్రజలు దీనిని ఎంతో ఉత్సాహంతో మరియు భక్తితో జరుపుకుంటారు.
2024 కార్తీక పూర్ణిమ తేదీ మరియు ఉపవాస సమయాలు కార్తీక పూర్ణిమ: శుక్రవారం, నవంబర్ 15, 2024

పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది - నవంబర్, 15 వ తేదీ, 2024 శుక్రవారం, ఉదయం 06 గం,19 ని (am) నుండి

పౌర్ణమి తేదీ ముగుస్తుంది - నవంబర్, 16 వ తేదీ, 2024 శనివారం, రాత్రి 02 గం,58 ని (am) వరకు
ఉపవాస నియమం ఉన్న.. ఉండాలనుకునే వారు మాత్రం 15వ తేదీ ఉపవాస నియమాలు పాటించి..రాత్రిపూట ఒత్తులు వెలిగించుకొని, చంద్రదర్శనం చేసుకుని భోజనం చేయవచ్చు.

మనం భగవంతునికి ఆత్మ నివేదన చేసుకోవాలి.. తద్వారా చేసినటు వంటి ఏ కార్యక్రమం అయినా భగవంతునికి ప్రీతిపాత్రమే..నిరంతర నామస్మరణతో సర్వేశ్వరుడు మన వెన్నంటే ఉంటారు.

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమను కార్తీక పౌర్ణమి అంటారు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హారులకు అత్యంత ప్రీతికరమైన మాంసం.

అన్ని మాసాల్లోను ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగిన మాసమని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి.

'శివునికి , విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున , కావున మానవాళికి వారిద్దరిని కోలిచి తరింస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో 'ప్రాశస్త్యం' కలిగినది అని పురాణాలుతెలుపుతున్నాయి. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే.

సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెలరోజులూ చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం ఒక్కటీ మరొక ఎత్తు; అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనీ పురాణాలు వివరిస్తున్నాయి.
ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది. శివ, విష్ణు దేవాలయాలు రెండింటా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయలమీద,బియ్యం పిండితో చేసిన ప్రమీదలలో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ, పూలతో అంకరించుకొని వెలిగించాలి.

శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండదీపాన్ని, ఆకాశదీపం పేరుతో ఎత్త్తెన ప్రదేశాల్లో భరిణలతో (కుండలు, లోహపాత్రలతో తయారుచేసి) వేలాడదీస్తారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో,నదులలో మొదలగు జల వనరుల్లో విడిచి పెడతారు. ఇలాచేయడం పుణ్యప్రదము,అష్టశ్వర్యాలు కలుగుతాయి.

వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగుంచే ఆనేక దీపాలవల్ల వాటినుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి, వాతవరణ శుద్ధి అవుతుంది తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది.

ఈరోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికీపేరు. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారుచేసిన ఆరాధనలోని చిన్నలోపంవల్ల సరైన వరం ఇవ్వదలచుకోలేదట శివుడు. అందుకే 'అల్పాయుష్కుడు, అతిమేధావి అయిన కొడుకు కావాలా... పూర్ణాయుష్కురాలు, విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే- కుమారుణ్నే కోరుకున్నారా దంపతులు. అతడి వయసు పెరుగుతున్న కొలదీ వారిలో గుబులూ జోరెత్తుతోంది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టిపడింది. అమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి, శక్తి కలదని విన్నారా దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమబిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు. వివాహమైన కొన్నాళ్లకే భర్తకోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి. తక్షణమే తనభక్తి ప్రభావంతో శివుని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం.
ఈ పౌర్ణిమకు త్రిపుర పూర్ణిమ అని మరొకపేరు. తారకాసురుడి ముగ్గురు కుమారులూ బ్రహ్మను మెప్పించి, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు. ఎవరివల్లా మరణం లేకుండా వరంకోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథంకాని రథంమీద, విల్లుకాని విల్లుతో, నారికాని నారి సారించి, బాణంకాని బాణం సంధించి, మూడు నగరాలూ ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురినీ ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు.

ఆ వర బలంతో పట్టణాలతో సహా సంచారంచేస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గర కెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తిలేదని, వారిని వెంటపెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు. దేవతలందరూ సహకరిస్తే తానీపని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లుకాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీమహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను (మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను) సంహరించాడని, అందువల్ల ఈ పేరు వచ్చిందనీ పురాణ కథనం.
ఈరోజు చేసే స్నానం, దీపారాధన, ఉపవాసం లాంటి అన్నింటిలోనూ ఆరోగ్య, ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి.

ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం వలన ఈ కాలపు వాతావరణ పరంగా మనకు ఎంతో ఆరోగ్య ప్రదం.

ప్రస్తుత కాలంలో ఉద్యోగాల బిజిలో కాని ఇతర ఏ కారణం చేతనైనా రోజు దేవుని పూజించి దీపారాధన చేసే టైం లేనివారు ఆచరించలేని వారు ఈ పౌర్ణమినాడు ఆచరిస్తే చాలు, నెలంతా చేసిన ఫలితం కలుగుతుంది.

ఈ రోజున స్త్రీల కోరకు ప్రత్యేకంగా ఉపవాసం గురించి శాస్త్రాలు చెబుతున్నాయి . పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి దీపారాధన చేసి, చలిమిడిని చంద్రుడికి నివేదించి, ఫలహారంగా స్వీకరించాలని చెబుతాయి . ఇలాచేయడం వల్ల కడుపు చలవ (బిడ్డలకు రక్ష) అని పెద్దలంటారు. ఆరోగ్యపరంగా చూస్తే- ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేద శాస్త్ర కథనం.

శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం ఈ రోజుకు మరో ప్రత్యేకత. ఇంకా ప్రాంతీయ, ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు, పూజలు, నోములు చేస్తారీ రోజు. వాటిలో వృషవ్రతం, మహీఫలవ్రతం, నానా ఫలవ్రతం, సౌభాగ్యవ్రతం, మనోరథ పూర్ణిమావ్రతం, కృత్తికా వ్రతం లాంటివి ముఖ్యమైనవి. వీటితోపాటు లక్షబిల్వార్చన, లక్షప్రదక్షిణ, లక్షవత్తులు, లక్షరుద్రం లాంటి పూజలూ చేస్తారు ఈ రోజు.
కార్తీక పౌర్ణమి నాడు ప్రత్యేకంగా చేయవలసినవి :

దైవ దర్శనం , దీపారాధన , దీపదానం , సాలగ్రామ దానం , దీపోత్సవ నిర్వహణ ఈ రోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అని కార్తీక పురాణంలో పేర్కొనబడినది.

ఎవరి శక్తి సామర్ధ్యాలను బట్టి హరి హారులను సేవించి వారి కారుణ కటాక్షాలు పొందండి. వీరిని ఎంత నిష్ఠతో తరిస్తే అంత శుభఫలితాలు ఉంటాయి, జైశ్రీమన్నారాయణ.


Tags: కార్తీక పౌర్ణమి, Karthikapurnima, Karthika masam, Lord Shiva, Karthika Somavaram, Kartik Purnima 2024, కార్తీక పూర్ణిమ 2024, Kartik Purnima, Kartik Purnima 2024 Date, Kartik purnima date, Kartik purnima significance, Kartik Purnima 2024 Date and Time
 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock