ఉండ్రాళ్ళ తద్దె వ్రతం సంపూర్ణ పూజ విధానంUndralla Taddi Pooja Vidhanam | Undralla taddi vratha katha

naveen

Moderator

ఉండ్రాళ్ళ తద్ది

భాద్రపద బహుళ తదియ రోజున సుదతులు , సద్గతులు పొందే నిమిత్తం ఆచరించే వ్రతమే _*‘ఉండ్రాళ్ళ తద్ది’.*_ భక్తి విశ్వాసాలతో నిష్ఠానుసారంగా ఆచరించిన వారికి సర్వాభీష్ట సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోము *‘ఉండాళ్ళ్ర తద్ది’* ఈ నోముకు *‘మోదక తృతీయ’* అనే మరోపేరు కూడా ఉన్నది.



ప్రత్యేకంగా ఉండ్రాళ్ళ నివేదన కలిగిన నోము కావడంచే *‘తద్ది’* అనుమాట మూడవ రోజు *‘తదియ’* అనే అర్థంతో వాడబడినది కనుక *‘తదియ’, ‘ఉండ్రాళ్ళ తద్ది’గా* పిలువబడుతున్నది.

ఈ నోమును భాద్రపదంలో బాగా వర్షాలు కురిసే ఋతువులో పూర్ణిమ వెళ్ళిన మూడోరోజున , అంటే బహుళ తదియన *‘ఉండ్రాళ్ళతద్ది’* నోమును నోచుకోవాలని మన పూర్వలు నిర్ణయించారని , అంతేకాదు ఈ నోమును గురించి సాక్షాత్తు శివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడని ఐతహ్యం.

ఉండ్రాళ్ళ తద్ది భాద్రపద బహుళ తదియ నాడు నోచుకునే నోము. ఉండ్రాళ్ళ తదియ రెండురోజుల పండుగ.

ఇది మహిళల పండగ కన్యలు ఆచరిస్తే మంచి భర్త లభిస్తాడని వేదపండితులు అంటున్నారు. అలాగే పెళ్ళయిన ఆడపిల్లలు నోమును పెళ్ళయిన ఏడాది నుండే ప్రారంభించి, పది సంవత్సారాలు నోచుకుంటారు. తమ భర్త , సంతానం ఆయురారోగ్యాలతో ఉండాలని, సంతానం లేనివారు సంతానం కలగాలని కోరుకుంటూ ఈ నోము నోచుకుంటారు.



ముందు రోజు ఐదుగురు ముత్తైదువులకి గోరింటాకు ముద్దా, పసుపు కుంకుమ, కుంకుడుకాయలు, నువ్వులనూనె వారికి ఇచ్చి , మా ఇంటికి తాంబూలం తీసుకోవడానికి రండి అని ఆహ్వానించాలి.

విదియ నాడు తలంటి స్నానాలు చేసి మధ్యాహ్నం గోరింటాకు రుబ్బి పెట్టుకుంటారు. వివాహం కాని ఆడపిల్లలు ఆ రోజు తెల్లవారుఝామున తలంటు పోసుకోవాలి. తలంటు అనగానే ఏదో షాంపూతో కాకుండా కుంకుడుకాయల రసంతో తలని రుద్దుకోవాలి. ఆ కుంకుడులోని చేదుతనం క్రిమికీటకాలని జుట్టులోకి రానివ్వదు. జుట్టులోని తడిని తరువాత మెత్తని టవల్ తో చుట్టుకోవాలి. తరువాత బాగా పీల్చుకునేలా చేసి సాంబ్రాణి పొగని పట్టించుకోవాలి. దీంతో జుట్టు అంతయు సువాసనతో నిండిపోవడమే కాకుండా తల తడవడంతో జుట్టు మూలాల దగ్గర ఉన్న తడి పూర్తిగా ఆరిపోతుంది. ఇక ఉదయం ఆరు గంటలకు ముందే గోంగూర పచ్చడితో పెరుగన్నం తినాలి.

రెండవ రోజు ఉండ్రాళ్ళ తద్దెలోని ప్రత్యేకత ఏమిటంటే తెల్లవారు ఝామునే భోజనాలు చేయడం. ఈ రోజు కూడా గోంగూర లేదా ఆవకాయ నంజుకుని పెరుగు అన్నం తిని అలసిపోయేవరకు దగుడుమూతలూ మొదలైన ఆటలు ఆడతారు.

ముగ్గురి ఇళ్ళలో ఊయల ఊగుతారు. ఆటలు పూర్తయిన తరువాత ఏ పిల్లకి సంబంధించిన తల్లి తాను తీసుకువచ్చిన ఉండ్రాళ్ళని వాళ్ళ కూతురికి ఇస్తే ఆ తల్లీ కూతురూ ఆ ఉండ్రాళ్ళని తల్లీ కూతుళ్ళకి ఇస్తారు. ఈ సందర్భంలో ఈ కూతురు ఆ తల్లికి , ఆ కూతురు ఈ తల్లికి నమస్కరిస్తారు.



మధ్యాహ్నం గౌరీ పూజ

గౌరీదేవిని షోడశోపచారాలతో పూజించిన వారికి సమస్తమైన శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఐదు దారపు పోగులు , ఐదు ముడులు వేసి ఏడు తోరాలను అమ్మవారి ప్రక్కనే పెట్టి పూజించాలి.

ఒక తోరం అమ్మవారికి , ఒకటి నోము చేసుకున్న వారికి , మిగిలిన ఐదు , ఐదుగురు ముత్తైదువులకు పూజ తరువాత కట్టాలి. బియ్యపుపిండిలో బెల్లం కలిపి , పచ్చి చలిమిడి చేసి ఐదు ఉండ్రాళ్ళను చేసి నైవేద్యంగా గౌరీదేవికి నివేదించాలి. పూజ తరువాత చేతిలో అక్షింతలు ఉంచుకుని వ్రతకథ చెప్పుకోవాలి.

వివాహం అయిన సంవత్సరం వచ్చే ఉండ్రాళ్ళ తద్దె రోజున నోమును పట్టుకుంటారు. ముందురోజు గోరింటాకు పెట్టుకోవాలి. ఉదయం నాలుగు గంటలకి నిద్రలేచి గోంగూర పచ్చడితో భోజనం చేయాలి.

తెల్లవారిన తరువాత స్నానం చేసి మూడు ఇళ్ళలో ఉయ్యాల ఊగాలి. గౌరీపూజ చేసి వాయనం ఇచ్చుకోవాలి. గౌరీపూజ పూర్తయిన తరువాత ఉండ్రాళ్ళ తద్దె వ్రతకథ చదవాలి. అక్షింతలు చేతిలో పెట్టుకుని, కథ పూర్తైన తరువాత అక్షింతలు అమ్మవారిపై వేసి అమ్మవారి పాదాల దగ్గరనుండి కొన్ని అక్షితలు తలపై చల్లుకోవాలి. ఒక పళ్ళెంలో ఐదు పూర్ణాలు లేకపోతే ఐదు ఉండ్రాళ్ళు , పండు తాంబూలం , ఐదు పోగుల తోరం , దక్షిణ వీటిని రెండు ప్లేట్లలో సర్థుకోవాలి.

ఒకటి గౌరీదేవికి నైవేద్యం. తోరం చేతికి చుట్టుకుని ఎవరైనా ముత్తైదువ ఉంటే ఆమెకు వాయనం ఇవ్వవచ్చు లేకపోతే గౌరీదేవికి వాయనం ఎత్తి విడిచిపెట్టాలి. వాయనం ఇచ్చిన తరువాత ఇచ్చినవాళ్ళు తినకూడదు. వాయనం ఇచ్చిన తరువాత తోరం చేతికి చుట్టి నమస్కారం చేసి అక్షింతలు వేయించుకోవాలి.

ఐదుగురు ముత్తైదువులను పిలుచుకోవాలి వారు ఆ రోజు తలస్నానం చేసి భోననానికి రావాలి. వాయనం ఆరు ప్లేట్లలో సర్థాలి. ఐదు పూర్ణాలు లేక మూడు పూర్ణాలు , రెండు గారెలు పెట్టవచ్చు. ఐదు పోగుల తోరం , ఒకటి వాయనం గౌరీదేవికి , పొంగలి , టెంకాయ , నైవేద్యం నివేదించి గౌరీదేవి షోడశోపేతంగా పూజ చేసి వ్రత కథ చదువుకుని అక్షింతలు మొత్తం గౌరీదేవిపై చల్లి కొన్ని అక్షింతలు గౌరీదేవి పాదాల దగ్గర ఉన్నవి తీసుకుని తలపై వేసుకోవాలి.



శివోహం శివోహం శివోహం :

పూజ పూర్తయిన తరువాత నైవేద్యం గౌరీదేవి దగ్గ్గర పెట్టిన ప్లేటులోని తోరం చేతికి కట్టుకుని ఇదుగురికి భోజనం వడ్డించిన తరువాత ఒక్కొక్కరికి ఒక వాయనం ఇవ్వాలి. వాయనం ఇస్తున్నప్పుడు , తీసుకునేటప్పుడు.

ఇచ్చేవారు తీసుకునే వారు కూడా..

ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటినమ్మా వాయనం

ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటినమ్మా వాయనం

ముమ్మాటికి ఇస్తినమ్మా వాయనం ముమ్మాటికి పుచ్చుకుంటినమ్మా వాయనం


వాయనం తీసుకున్నది ఎవరు నేనే పార్వతిని,

ఈ విధంగా ఐదుగురికి ఇవ్వాలి, అందరికీ తోరములు చేతికి చుట్టాలి, ముడి వేయకూడదు. బియ్యంపిండితో ముద్దతో కుందిలా చేసి దాంట్లో ఆవునేతితో తడిపిన కుంభవత్తి పెట్టి , ఐదుగురి విస్తరాకుల ముందు పెట్టి వెలిగించాలి. అవి కొండెక్కిన తరువాత జ్యోతితో సహా చలిమిడిని తినాలి. నోము చెల్లించుకునే ముత్తైదువ నెయ్యి వడ్డించిన తరువాత భోజనం చేయాలి. ఐదు పోగులకు పసుపు రాసి, మూడు చోట్ల పూలు ముడివేసి, రెండు చోట్ల ముడి వేసి తోరము సిద్ధం చేసుకోవాలి. ఈ నోము పట్టడానికి పుట్టింట్లో కానీ అత్తగారింట్లో కాని పట్టవచ్చు. ఇలా పది సంవత్సరాలు చేసి ఉద్యాపన చెయ్యాలి.



ఇలా తమతమ శక్తిని బట్టి వాయనంతో చీర , రవికెలను కూడా సమర్పించుకొనవచ్చును. ఈ ఉండ్రాళ్ళ తద్ది నోమును ఐదు సంవత్సరాలు ఆచరించిన తర్వాత నోముకు వచ్చిన వారందరికి పాదాలకు పసుపు - పారాణి రాసి నమస్కరించి, వారి ఆశీస్సులు పొంది, అక్షతలను వేయించుకోవాలి.

ఈ ఉండ్రాళ్ళ తద్ది నోమును ముఖ్యంగా పెళ్ళికాని కన్యలు ఆచరించడంవలన విశేషమైన ఫలితాలను పొందుతారని , మంచి భర్త లభిస్తాడని పురాణోక్తి.

వ్రత కథ

పూర్వము ఒక రాజు ఏడుగురు భార్యలు కలిగియున్నా , ఓ వేశ్యయైన ‘చిత్రాంగి’పై ఆయనకు మక్కువ ఎక్కువగా ఉండేది. ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి భార్యలందరూ ‘ఉండ్రాళ్ళ తద్ది’ అనే నోమును నోచుకుంటున్నారని చెలికత్తెల ద్వారా వినిన చిత్రాంగి, రాజుగారితో ‘‘నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ‘ఉండ్రాళ్ళ తద్ది’ నోము చేయించుకున్నావు.

నేను ఒక వేశ్యనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యలమీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాళ్ళ తద్దెనోము జరుపుకోవటానికి అవసరమైన సరకులను సమకూర్చమని’’ రాజు తనవద్దకు వచ్చిన సమయంలో అడిగింది. రాజు అట్లేయని సరుకులను పంపిస్తాడు.

ఆ చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేల్కొని అభ్యంగన స్నానమాచరించి, సూర్యాస్తమయము వరకు ఏమీ భుజించక ఉపవాస దీక్ష ఉండి , చీకటి పడగానే గౌరిదేవికి బియ్యపుపిండితో ఉండ్రాళ్ళను చేసి , ఐదు ఉండ్రాళ్ళను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి , మరో అయిదు ఉండ్రాళ్ళను ఒక పుణ్యస్త్రీ కి వాయనమిచ్చి , నోము ఆచరించి గౌరిదేవి అనుగ్రహాన్ని పొందినదై అలా ఐదేళ్ళు నిర్విఘ్నంగా నోమునోచుకుని , ఉద్యాపన చేసిన ఫలితంగా ఆపవిత్రయైన ఆమె ఆ నోము ఫలంగా సద్గతిని పొందింది.



పూర్వం ఓ వేశ్య తన సౌందర్యం తో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంది. ఒక ఉండ్రాళ్ళతద్దెనాడు , రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు. ఆమె అహంకారముతో దైవ నింద చేసేసి నోముకో లేదు. ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్ళారు. మహా వ్యాధి బారిన పడ్డది.

తరువాత రాజ పురోహితుడి సలహాతో ఉండ్రాల తద్దె నోము నోచుకొని , తన సంపదని తిరిగి పొంది , ఆరోగ్యస్తురాలై శేష జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి , మరణానంతరం గౌరీ లోకానికి వెళ్ళింది.


Tags: ఉండ్రాళ్ళ తద్ది, ఉండ్రాళ్ళ తద్దె, Undralla taddi 2024, 2024 Atla Tadde, Undralla taddi in telugu 2024, Undralla Taddi date, Undralla Taddi Katha, Undralla taddi katha telugu
 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock