మహారాష్టల్రోని అత్యంత ప్రముఖమైన పుణ్యక్షేత్రాలలో ‘పండరీపురం’ ఒకటి. మహారాష్టల్రోని షోలాపూర్ జిల్లాలో ఉన్న ‘పండరీపురం’ ఒకప్పుడు చిన్ని గ్రామం. ఇక్కడ ప్రతిపాదించే చంద్రబాగా నదిని భీమా నది అని కూడా పిలుస్తారు. రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకునే పండరీపురం పాండురంగ విఠలుని మందిరం అత్యంత మహిమాన్వితమైన విశిష్టత గలది. తేజోవిరాజమైన పాండురంగ విఠలుని మందిరం శోభాయమానంగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఆలయం ఏ కాలంనాటిదని చెప్పడానికి ఇతమిత్థమైన ఆధారాలు లేకపోయినప్పటికీ, 12-13శతాబ్దాల కాలంనుంచే ఈ ఆలయానికి చెందిన ఉనికి తెలుస్తునే ఉంది. నిరంతరం పాండురంగస్వామి నామస్మరణతో మారుమ్రోగే ఈ ఆలయ శోభవర్ణనాతీతం.
ప్రధానాలయానికి ముందుద్వారం మధ్య భాగంలో భక్తాగ్రేసరుడు నామ్‌దేవ్ మహరాజ్ సుందరిమూర్తి ఒకటి ఉంది. పండరీపురం పాండురంగస్వామి వారి దర్శనంకోసం వచ్చే భక్తులు ముందుగా నామ్‌దేవ్ మహరాజ్ వారి మూర్తిని దర్శించుకుంటేనే పాండురంగస్వామి వారిని దర్శించుకున్న ఫలం దక్కుతుందని చెబుతారు. ఈ మూర్తికి సమీపంలో నామ్‌దేవ్‌మహరాజ్ మెట్లు దర్శనమిస్తాయి. ఉత్సవాలపుడు భక్తులు ఈ మెట్లుమీదుగానే ప్రధానాలయంలోకి చేరుకుంటారు. నిత్యమూ భక్తులతో రద్దీగా ఉండే గర్భాలయ ప్రాంగణంలో కుడివైపున భక్తతుకారాం పాదుకలున్నాయి. అలాగే గర్భాలయ మంటపంలో వినాయకుడు, లక్ష్మీనారాయణ మూర్తులున్నాయి. గర్భాలయ మండపం 16 స్తంభాలతో నిర్మితమైంది. గర్భాలయం వెండి ద్వారంమీద స్వామివారి లీలా విశేషాలను తెలిపే మూర్తులున్నాయి. గర్భాలయ మండపంలో గరుడ స్తంభం ఉంది. వెండితో చేసిన ఈ స్తంభాన్ని దర్శించుకున్నా, భక్తితో ఆలింగనం చేసుకున్నా పాండురంగస్వామిని ఆలింగనం చేసుకున్న ఫలం లభిస్తుందంటారు. ఇక్కడ స్వామి పాదాలను భక్తులు స్వయంగా తాకి నమస్కరించుకోవచ్చు. శిలారూపుడైన స్వామి ఇక్కడ రెండుచేతులను నడుంమీద పెట్టినట్టుగా దర్శనమిస్తాడు.
పాండురంగని మూలమూర్తికి సమీపంలో రుక్మిణీ మాత మందిరం ఉంది. ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వరుడు, శ్రీవెంకటేశ్వరుడు, సత్యభామ, రాధికమాత, శనీశ్వరస్వామి, సూర్యనారాయణస్వామి, మహాలక్ష్మి, భక్తతుకారాం, ఆంజనేయస్వామి, నామ్‌దేవ్ తదితర మందిరాలు కూడా దర్శనమిస్తాయి. పండరీపురం క్షేత్రానికి సమీపంలో ఉన్న గోపాలపురంలో జానాబాయి, సక్కుబాయి వాడిన బిందెలు, తిరగలి, కుండలను దర్శించుకోవచ్చు. ఇలా ఈ క్షేత్రరాజంలో భక్తుల మందిరాలు ఎక్కువగా కనిపించడానికి కారణం కేవలం ఈ పాండురంగడు భక్తజన పక్షపాతి కనుకనే. ఎందరెందరో భక్తులు ఈ పాండురంగని దయామృతాన్ని గ్రోలిఉన్నారు. అటువంటి వారిలో పుండ రీకుడు కూడా ఒకడు. ఈ పుండరీకుని భక్తిమహాత్మ్యం వల్లనే ఈ పాండురంగడు ఇటుకరాయపై నడుముకు చేతులుచేర్చి దర్శనం ఇస్తాడు.
ఒకానొక కాలంలో భక్త పుండరీకుడు పూర్వాశ్రమంలో దుర్వసనాలకు బానిస. ఇతడు కన్న తల్లితండ్రులను, కట్టుకొన్న భార్యను సైతం పక్కకు నెట్టి తన భోగలాలస తో కాలం గడిపేవాడు. ఈ పుండరీకుని ఉద్దరించమని తల్లితండ్రులు, భార్య నిరంతరం శ్రీకృష్ణ్భగవానుడిని ప్రార్థించేవారు. వారి కోరిక ఆ దేవదేవుడు విన్నట్టున్నాడు. కొన్ని సంఘటనల ఫలితంగా పుండరీకునిలో భోగలాలస వీడిపోయంది. అశాశ్వతమైన అందాలకు దాసుడు కావడం జీవితాన్ని నరక్రపాయం చేసుకోవడమే అని తెలుసుకున్నాడు. క్షణభంగురమైన ఈ జీవితంలో మాధవ సేవను మించినదేది లేదని తెలుసుకొన్నాడు. అంతే కాక తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సేవ చేయడమే పరమోత్కృష్టం అని తెలుసుకున్నాడు.
ఇక అటు తల్లితండ్రుల సేవ, ఇటు పాండురంగని సేవలో పుండరీకుడు తరించిపోయే స్థితికి చేరుకున్నాడు. అటువంటి కాలంలో పుండరీ కుని పరీక్షిద్దామని వైకుంఠ పురం నుంచి పాండరంగడు వచ్చిపుండరీకా నీతో కాసే పు ముచ్చటిద్దామని వచ్చాను అన్నాడట. ఆ సమయానికి వృద్ధులైన తన తల్లితండ్రుల సేవలో ఉన్న పుండరీకుడు పరమానందపడి, కాని పాండురంగా ఇపుడు నా తల్లి తండ్రుల సేవలో ఉన్నాను. అందాక నీవు ఈ ఇటుక పై నిలువుమని తన దగ్గరలో ఉన్న ఇటుకను ఆసనంగా చేసుకోమని ఇచ్చాడట. ఆ భక్త వరదుడు తన భక్తుని కోరికననుసరించి ఆ ఇటుకపైనే నిల్చున్నాడట. పైగా తనభక్తుడు ఎంత తన్మయత్వంతో కన్నవారికి సేవచేస్తున్నాడో అనే ఆశ్చర్యానందాలతో చేతులను నడుముకు చేర్చి నిల్చున్నాడట. పుండరీకుడు తాను చేయాల్సిన పనిని చేసుకొని వచ్చి ‘‘ఆహా పాండురంగా ఇలా నిన్ను చూడడం నా మహద్భాగ్యం. ఎంత అందంగా ఉన్నావయ్యా. స్వామి నాలాంటి భక్తులందరికీ ఈ రూపులోనే దర్శనం ఇవ్వు ’’ అనిప్రార్థించాడు. అంతే ఏది కోరితే దాన్ని ఇచ్చే ఆ భక్త దయాళు ఆ నాటి నుంచి ఈ నాటి కీ ఆరూపంలోనే దర్శనం ఇస్తున్నాడు.
భక్తులకే పెద్దపీట వేసే ఈ భాగీరధీ తీరంలో వెలసిన పాండురంగని దర్శించుకొని పాండురంగని దయకు పాత్రులమవుదాం.
పాండురంగడు అయిన విఠలుడ్ని దర్శించుకుంటే ,సకల పాపాలు తొలగి అష్టఐశ్వర్యాలు సిద్దిస్తాయిని భక్తుల విశ్వాసం
యాత్రాసౌకర్యం: పండరీపురం క్షేత్రానికి షోలాపూర్‌కు వరకూ రైలులో వచ్చి అక్కడినుంచి బస్సులో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. షోలాపూర్ నుంచి పండరీపురానికి దూరం 74 కిలోమీటర్లు.
Tags: పండరీపురం, Pandhuranga Vittala, Panduranga Vittala Temple, Vithoba Temple, Pandharpur, Pandharpur Temple Timings, Pandharpur temple history, Panduranga Temple, Panduranga Stotram, Panduranga Temple Telugu, Maharashtra